అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి

30 Jan, 2021 18:38 IST|Sakshi

మానవత్వం మరిచిన మున్సిపల్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు

భోపాల్‌: వారంతా వయసు పైబడిన వృద్ధులు.. సంతానానికి బరువయ్యారో.. లేక నా అన్న వారు ఎవరు లేరో తెలియదు.. ఉండటానికి ఇళ్లు లేదు. పొద్దంతా వీధుల వెంట తిరుగుతూ.. రాత్రికి షాపుల ముందు.. రోడ్డు పక్కన తల దాచుకుటారు. వారి పట్ల దయ చూపాల్సిన ప్రభుత్వం కళ్లెర్ర చేసింది. ఇలాంటి వారి వల్ల నగర ప్రతిష్ట దెబ్బ తింటుందని భావించి.. అత్యంత అమానవీయ రీతిలో వారిని ఓ మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లి ఊరి బయట వదిలేశారు. చలిలో ఆ ముసలి ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ఏటు వెళ్లలేక అవస్థపడ్డ తీరు వర్ణానాతీతం. వీరి అవస్థ చూసిన గ్రామస్తులు సిబ్బంది తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో వారిని తిరిగి నగరంలోకి తీసుకెళ్లారు. ఇక ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సదరు ప్రభుత్వ అధికారిపై దుమ్మెత్తిపోశారు నెటిజనులు. దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం ఆ ఉన్నతాధికారిని సస్పెండ్‌ చేసింది. గుండెతరుక్కుపోయే ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 
(చదవండి: కూతురి కోసం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో)

ఆ వివరాలు.. ఇండోర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రతాప్‌ సోలంకి డిప్యూటి కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సోలంకి ఆదేశాల మేరకు మున్సిపల్‌ సిబ్బంది నగరంలో ఇళ్లు లేకుండా రోడ్డు పక్కన నివసించే వారిని గుర్తించి నగర శివార్లలోని గ్రామం సమీపంలో విడిచిపెట్టారు. ఇలా తరలించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. మున్సిపల్‌ సిబ్బంది వీరందరిని ఓ ట్రక్కులో ఎక్కించి.. గ్రామం సరిహద్దులో వదిలేశారు. పాపం చలిలో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక, దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇక అధికారుల చర్యలను నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దాంతో మున్సిపల్‌ అధికారులు వారిని తిరిగి సిటీలోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మున్సిపల్‌ సిబ్బంది తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రతాప్‌ సోలంకితో సహా ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక జిల్లా కలెక్టర్‌ ఆ వృద్ధుల బాగోగులను చూసుకోవాల్సిందిగా సూచించారు. ఈలాంటి చర్యలను ఏ మాత్రం సహించబోనని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు