భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్ట్‌.. 30 లక్షల రివార్డు.. నేపాల్‌లో అరెస్ట్‌

23 May, 2023 13:03 IST|Sakshi

ఢిల్లీ: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేతను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు ఎన్‌ఐఏ అధికారులు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ నేపాల్‌లో తలదాచుకున్న మావోయిస్టు నేత దినేష్‌ గోపే అరెస్ట్‌ అయ్యాడు. ఇక, అంతకుముందు గోపే ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి.

వివరాల ప్రకారం.. మావోయిస్టు నేత దినేష్‌ గోపే మారు వేషంతో నేపాల్‌లో తలదాచుకుంటున్నాడు. మూడు రాష్ట్రాల్లో 100కుపైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న గోపేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. కాగా, నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన దినేష్‌ గోపే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ 13 నెలలుగా నేపాల్‌లో దాబా నడుపుతున్నాడు. అయితే, ఇటీవల ఆయన.. జార్ఖండ్‌లోని బీజేపీ నేతలకు ఫోన్‌ కాల్‌ చేయడంతో ఎన్ఐఏకు చిక్కాడు. అతడి ఫోన్‌కాల్‌ను ట్రేస్‌ చేసిన అధికారులు.. గోపే నేపాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు ఎంతో చాకచక్యంగా గోపేను అరెస్ట్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. గతేడాది జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భమ్‌లో గోపే నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ నుంచి గోపే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయి అంతర్జాతీయ సరిహద్దులోని బిరత్‌నగర్‌లో ధాబా నడుపుతున్నాడు. అయితే, నిరుద్యోగులైన యువకులకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మోటార్ బైక్స్ ఇచ్చి హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేలా చేశాడు దినేష్‌ గోపే.

కాగా, గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. మరోవైపు.. జార్ఖండ్‌, బీహార్, ఒడిశాలలో హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులు, దోపిడీలు, నిధుల సేకరణ వంటి వాటికి సంబంధించి గోపేపై 102 కేసులు నమోదయ్యాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: 'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్‌ పవార్‌

మరిన్ని వార్తలు