హిడ్మా చనిపోలేదు సేఫ్‌.. కేంద్రం కుట్రలో భాగమే అంతా!

12 Jan, 2023 11:45 IST|Sakshi

బస్తర్‌:   తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ఎన్‌కౌంటర్‌లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్‌ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ  ప్రకటించింది.

బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా  మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి.

గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను  దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది.

హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా?

మరిన్ని వార్తలు