కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ. 119 లక్షల కోట్లు

10 Aug, 2021 03:33 IST|Sakshi

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో చెల్లింపు సామర్థ్యం 

లోక్‌సభలో ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానం 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ. 119,53,758 కోట్లుగా ఉందని, ఇది జీడీపీలో 60.5 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. ఎంపీ సజ్దా అహ్మద్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.8 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 4.5 శాతానికంటే దిగువకు పరిమితం చేసే దిశగా కేంద్రం దృష్టి సారించింది. పన్నుల ఎగవేతను నివారించి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి స్థలాల అమ్మకం, ఆస్తుల ద్వారా ఆదాయ సముపార్జన వంటి అదనపు చర్యల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రణాళిక ఉంటుంది..’ అని తెలిపారు.

‘కేంద్ర ప్రభుత్వ అప్పు అంచనాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి ఉన్నాయి. రాష్ట్రాలు తెస్తున్న రుణాలపై తగిన పరిమితులు, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుకు తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుత అప్పు వల్ల పెద్ద ఆందోళన ఏమీ లేదు..’ అని తెలిపారు. ‘ద్రవ్య లోటు తగ్గింపు చర్యలు, పన్నుల ఎగవేతను నివారించి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి స్థలాల అమ్మకం, ఆస్తుల ద్వారా ఆదాయ సముపార్జన వంటి అదనపు చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వానికి చెల్లింపు సామర్థ్యం సమకూరుతుంది..’ అని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు