బుగ్గలు గిల్లితే లైంగిక వేధింపులు కావు

6 Feb, 2021 04:01 IST|Sakshi

పోక్సో చట్టం కింద మరో షాకింగ్‌ తీర్పు  

ముంబై: మనసులో చెడు ఉద్దేశాలు లేకుండా మైనర్‌ బాలిక బుగ్గలు గిల్లితే అది నేరం కాదని ముంబైలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఒక బాలిక బుగ్గల్ని మాటిమాటికి తడిమిన 28 ఏళ్ల వయసున్న ఎలక్ట్రీషియన్‌ను కేసు నుంచి విముక్తుడిని చేసింది. అయితే అదే సమయంలో ఆ బాలిక తల్లిపై చేసిన అత్యాచార యత్నం కేసులో నేరస్తుడిగా తీర్పు చెప్పి అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించింది.  

అసలేం జరిగిందంటే..?
2017, జూన్‌2న జరిగిన ఈ ఘటనలో మధ్యాహ్నం పూట తల్లీ, కూతుళ్లిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో రిఫ్రిజిరేటర్‌ బాగు చేయడానికి ఒక ఎలక్ట్రీషియన్‌ వాళ్లింటికి వచ్చాడు. ఫ్రిజ్‌ని పరీక్షించి చూసిన అతను స్పేర్‌ పార్ట్‌ వెయ్యాలని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ కూతురి బుగ్గలు గిల్లాడు. దీంతో తల్లి ఎలక్ట్రీషియన్‌ని గట్టిగా మందలించి తన కూతురి ఒంటిపై చెయ్యి వెయ్యొద్దని హెచ్చరించింది. ఇంతలో వంటగదిలో ఏదో పని ఉందని లోపలికి వెళ్లిన ఆ మహిళను వెనక నుంచి వచ్చి అతను కౌగిలించుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేసి ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్‌ మళ్లీ ఆమె కుమార్తె బుగ్గలు గిల్లాడు. దీంతో ఆమె ఆ ఎలక్ట్రీషియన్‌ పని చేస్తున్న సంస్థకి, పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు.

కోర్టు ఏమందంటే.. : ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఆ మహిళ చెప్పిందంతా విని బాలిక బుగ్గలు గిల్లడం పోక్సో చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. మనసులో శృంగారపరమైన వాంఛలు లేకుండా బుగ్గ గిల్లితే దానిని నేరం కింద చూడలేమని పేర్కొంది. మరోవైపు ఆ మహిళపై అత్యాచార యత్నం చేసినందుకు నిందితుడైన  ఎలక్ట్రీషియన్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలి కాలంలో రకరకాల లైంగిక వేధింపులు పోక్సో చట్టం కింద నేరం కావంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం.

మరిన్ని వార్తలు