రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

2 Feb, 2021 19:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక కార్మిక సంఘాలు పోరాట బాట పట్టనున్నారు. ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్‌లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త నిరసనలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాల‌ను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలనే డిమాండ్‌పై 10 కార్మిక సంఘాలు ఆందోళనలు చేయనున్నాయి. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్‌, యూటీయూసీ రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి.

ఈ మేరకు మంగళవారం కార్మిక సంఘాల సంయుక్త ఫోరం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనల్లో భాగంగా బుధవారం భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్‌ కోడ్స్‌ను ప్రతులను దగ్ధం చేస్తామని ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్‌లో తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరోగమన దిశగా ఉండటంతో పాటు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశాయి. ఈ డిమాండ్‌పై ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

మరిన్ని వార్తలు