పెట్రోల్‌ ధరల సెగ.. 26న భారత్‌ బంద్‌

24 Feb, 2021 16:59 IST|Sakshi

8 కోట్ల మంది పాల్గొనే అవకాశం

రైతుల మాదిరి జాతీయ రహదారుల దిగ్బంధానికి ప్లాన్‌

పెట్రోలియం ధరలు, ఈ - వే బిల్లు నిబంధనలపై నిరసన

న్యూఢిల్లీ: నిరాటంకంగా పెరుగుతూ సెంచరీ మార్క్‌ దాటుతున్న పెట్రోల్‌ ధర.. దానికి అనుగుణంగా పోటీ పడుతూ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

26న భారత్‌ బంద్‌ చేపట్టాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునివ్వడంతో దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌-ఏఐటీడబ్ల్యూఏ) కూడా సంపూర్ణ మద్దతు పలికింది. బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి వాహనదారుల సంఘం బంద్‌కు మద్దతిస్తాయని ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య తెలిపారు. డీజిల్‌ ధరల పెంపుకు నిరసనగా ఒకరోజు బంద్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన ఈ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. డీజిల్‌ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ధరలు ఒకేలా ఉండాలని కోరారు. 

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ‘చక్కా జామ్‌ (జాతీయ రహదారుల దిగ్భంధం)’ను చేపడతామని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ప్రకటించింది. 26వ తేదీన రహదారుల దిగ్బంధం చేస్తామని స్పష్టం చేసింది. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీజిల్‌ ధరలు తగ్గించాలని.. జీఎస్టీని సమీక్షించి సిఫారసులు చేయడానికి ఓ కమిటీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేసింది. భారత్‌ బంద్‌కు దేశంలోని దాదాపు 40 వేల కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని సమాచారం. ఈ భారత్‌ బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొనున్నారు.

మరిన్ని వార్తలు