Chhattisgarh: రూ.45లక్షలు దొరికితే ఇచ్చేసిన ట్రాఫిక్ పోలీసు.. అధికారుల ప్రశంసలు

24 Jul, 2022 11:47 IST|Sakshi

రాయ్‌పుర్‌: రోడ్డుపై వెళ్తున్న క్రమంలో రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అదే కట్టల కొద్ది డబ్బు దొరికితే ఇంకేమన్నా ఉందా.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తమకు దొరికిన వాటిని ఎంతో నిజాయితీతో తిరిగి ఇచ్చేస్తారు. అలాంటి కోవకే చెందుతారు ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్‌ పోలీసు. రోడ్డుపై తనకు రూ.45లక్షలు దొరికితే పోలీసులకు అప్పగించారు. 

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లోని నవా రాయ్‌పుర్‌ కయబంధా పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిలాంబర్‌ సిన్హా. మనా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారు జామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. దానిని తెరిచి చూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.‘ బ్యాగ్‌ తెరిచి చూడగా మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కానిస్టేబుల్‌. ఆ తర్వాత సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బ్యాగ్‌ను అప్పగించారు.’ అని అదనపు ఎస్పీ సుఖ్నాందన్‌ రాథోడ్‌ తెలిపారు. 

రివార్డ్‌ ప్రకటన..
నోట్ల కట్టలతో బ‍్యాగు దొరికితే తిరిగి తీసుకొచ్చి తన నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను అభినందించారు ఉన్నతాధికారులు. రివార్డ్‌ ప్రకటించారు. బ్యాగు ఎవరిదనే విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు సివిల్‌ లైన్స్‌ పోలీసులు.

ఇదీ చదవండి: గ్రీన్‌ సిగ్నల్‌ ఫర్‌ ‘టైగర్‌’.. నిలిచిపోయిన ట్రాఫిక్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు