ప్రముఖ సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామి ఇకలేరు

4 May, 2021 20:53 IST|Sakshi

ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కన్నుమూత

ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్లపై పోరు చేసిన  రామస్వామి

టెక్కీ సుబశ్రీ మరణం తరువాత  చట్టం కోసం  కృషి

సాక్షి, చెన్నై: ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి (87) ఇకలేరు.  అనారోగ్య సమస్యలతో  చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్న  ఆయన మంగళవారం కన్నుమూశారు.  ప్రధాన సిగ్నల్స్‌ వద్ద  ట్రాఫిక్‌ నియంత్రణకు  నిరంతరాయంగా పాటు పడుతూ, ట్రాఫిక్ పోలీసులకు సహాయం చేస్తూ  వచ్చిన ఆయన  ట్రాఫిక్‌  రామస్వామిగా పాపులర్‌ అయ్యారు. అంతేకాదు  నగరంలో విచ్చలవిడిగా వెలిసే ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్లపై రామస్వామి ఎనలేని పోరాటమే చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. దీంతో పలువురు రామస్వామిమృతిపై సంతాపం వ్యక్తం చేశారు.  వన్‌ మేన్‌ ఆర్మీలా చాలా పోరాటాల్లో ఒంటరిగానే నిలిచారనీ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్‌ చేశారు.  అదీ ఆయన నిబద్ధత, ప్రత్యేకత అంటూ పలువురు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.

ముఖ్యంగా రాజకీయ నాయకుల, సినీ ప్రముఖులు రోడ్లపై  ఏర్పాటు చేసే పెద్ద హోర్డింగ్‌లకు వ్యతిరేక పోరాటాలతోనే ఆయన జీవితమంతా సాగిపోయింది. పడే హోర్డింగ్ కారణంగా టెక్కీ సుబశ్రీ మరణించిన తరువాత హైకోర్టులో రామస్వామి పోరాటం బెదిరింపులకు వ్యతిరేకంగా  కీలకమైన ఒక చట్టం  రూపొందింది. ప్రజాశ్రేయస్సుకోసం అనేక సామాజిక ఉద్యమాల్లో  క్రియాశీలకంగా పాలుపంచుకునేవారు. పాలక పార్టీలు, రాజకీయ నాయకులపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనేకసార్లు అరెస్టయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై రామస్వామి పెట్టిన అనేక కేసులు మద్రాసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.  ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఫ్లెక్సీలను తానే స్వయంగా చించివేసి వార్తల్లో నిలిచారు. అందుకే ఆయన ట్రాఫిక్ రామస్వామిగా తమిళ ప్రజలకు అభిమాన పాత్రుడయ్యారు.

మరిన్ని వార్తలు