జెండా పండుగలో విషాదం

16 Aug, 2022 10:18 IST|Sakshi

యశవంతపుర: జెండా పండుగ వేళ పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గుండెపోటుతో ఒకరు, జెండా కడుతూ కిందపడి మరొకరు ప్రాణాలు విడిచారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుట్రుపాడి గ్రామ పంచాయతి ఆఫీసులో సోమవారం ఉదయం జెండాను ఎగురవేస్తుండగా మాజీ జవాన్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మాజీ జవాన్‌ గంగాధర గౌడను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. అతిథి ప్రసంగిస్తుండగా గంగాధరగౌడ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

జారిపడి గాయాలతో టెక్కీ మృతి  
హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా ఇంటిపై జెండా కడుతూ కిందపడి టెక్కీ చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరు హెణ్ణూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. దక్షిణకన్నడ జిల్లా సుళ్యకు చెందిన విశ్వాస్‌కుమార్‌ భట్‌ (33) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. హెచ్‌బీఆర్‌ లేఔట్‌ ఐదో బ్లాక్‌లో భార్య వైశాలితో కలిసి రెండేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి మీద పతాకాన్ని కడుతూ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు.     

(చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం )

మరిన్ని వార్తలు