పట్టాల మధ్య ఇరుక్కున్న ట్రాక్టర్‌.. వేగంగా వచ్చిన రాజధాని ఎక్స్‌ ప్రెస్‌.. తరువాత?

7 Jun, 2023 12:29 IST|Sakshi

జార్ఖండ్‌లోని బొకారోలో డ్రైవర్‌ సమయస్ఫూర్తి కారణగా రైలు ప్రమాదం తృటిలో తప్పింది.  వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం బొకారోలోని సంథాల్‌డీహ్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద ఒక ట్రాక్టర్‌ పట్టాల మధ్య  ఇరుక్కుపోయింది.  అదే సమయంలో అటువైపుగా న్యూఢిల్లీ- భువనేశ్వర్‌  రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వస్తోంది. అయితే రైలు డ్రైవర్‌ సమయస్ఫూర్తి కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది.

డీఆర్‌ఎస్‌ మనీష్‌ కుమార్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బొకారో జిల్లాలోని భోజూడీహ్‌ రైల్వే స్టేషన్‌  పరిధిలోని సంథాల్‌డీహ్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద రైల్వే గేటు మూసుకుపోవడంతో ఒక ట్రాక్టర్‌ మధ్యలో చిక్కుకుపోయింది. అదేసమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌(22812) అటుగా వస్తోంది. ఆ ట్రాక్టర్‌ను గమనించిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రైలు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది. ఈ ఘటన కారణంగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ సుమారు 45 నిముషాలు ఆగిపోయింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడంతోపాటు గేట్‌ మ్యాన్‌ను విధుల నుంచి తొలగించారు. కాగా జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 

చదవండి: రైలు నుండి పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
 

మరిన్ని వార్తలు