Odisha Train Accident: ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరులు మృతి

4 Jun, 2023 11:55 IST|Sakshi

ఒడిశాలో చోటుచేసుకున్న రైలు ‍ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. పలు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొన్ని కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోగా, మరికొన్ని కుటుంబాల్లో ఎదిగొచ్చిన పిల్లలు అకాల మృత్యువు పాలయ్యారు. అలాంటి ఉదంతం ఒకటి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు సోదరులు రైలులో తమిళనాడు బయలుదేశారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వీరు దుర్మరణం పాలయ్యారు.

వీరిని 24 పరగణా జిల్లాలోని చర్నీఖలీ గ్రామానికి చెందిన హరన్‌ గోయెన్‌(40) నిశికాంత్‌ గోయన్‌(35) దివాకర్‌ గోయెన్‌(32)గా గుర్తించారు. వీరు ఏడాదిలో చాలాకాలం తమిళనాడులోనే ఉంటూ, అక్కడ దొరికిన పనులు చేస్తుంటారు. ఇటీవలే వీరు స్వగ్రామానికి వచ్చారు. కొన్నాళ్లు ఉన్నాక తిరిగి తమిళనాడు వెళ్లేందుకు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. రైలు ప్రమాదంలో ఈ ముగ్గురు సోదరులు మరణించారనే వార్త తెలియగానే వారి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు సోదరులలో ఒకరైన హరన్‌ భార్య అంజిత చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

ఇప్పుడు ఆమె గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. మృతి చెందిన ముగ్గురు సోదరుల తమ్ముడు ఇటీవలే ఒక హోటల్‌లో పనిలో చేరాడు. తండ్రిలేని ఈ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని స్థానికులు విలపిస్తున్నారు. నిశికాంత్‌ కుటుంబం విషయానికొస్తే ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు ప్రమాదంలో 24 పరగణా జిల్లాకు చెందిన 12 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 110 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పుటి వరకూ 16 మంది బాధితులు వారి ఇళ్లకు చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు