అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్‌.. పోలీసులు వర్సెస్‌ నిరసనకారులతో ఉద్రిక్తత

16 Jun, 2022 14:42 IST|Sakshi

పాట్నా: త్రివిధ దళాల సంస్కరణల్లో భాగంగా.. స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్‌’ తెరపైకి తెచ్చింది కేంద్రం. అయితే దీనిని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనలూ మొదలయ్యాయి. ఆర్మీలో చేరాలనే ఉత్సుకతతో ఉన్న యువత.. రోడ్ల మీదకు చేరి నిరసనలు వ్యక్తం చేస్తోంది.

తాజాగా ఈ రాడికల్‌ రిక్రూట్‌మెంట్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ.. బీహార్‌లో కొనసాగుతున్న నిరసనలు ఘర్షణ వాతావరణానికి తెర తీశాయి. వరుసగా రెండో రోజూ.. రోడ్లు, రైలు పట్టాల మీదకు చేరిన యువత.. అగ్నిపథ్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తోంది. ‘ఇండియన్‌ ఆర్మీ లవర్స్‌’ పేరుతో బ్యానర్లు చేతబట్టి బాబువా రోడ్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఏకంగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు అద్దాలను పగలకొట్టి.. ఓ కోచ్‌కు మంటపెట్టారు. 

ఇదిలా ఉండగా.. ఆరాహ్‌ దగ్గర రాళ్లు రువ్విన నిరసనలకారుల మీద, ప్రతిగా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. రైలు పట్టాల మధ్య ఫర్నీచర్‌కు నిప్పు పెట్టి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. 

జెహానాబాద్‌లో విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. నిరసనకాలరును చెదరగొట్టేందుకు.. తుపాకులను గురిపెట్టి భయపెట్టారు. నవాడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.    

వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన అగ్నిపథ్‌ పథకానికి.. మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్‌ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త విధానంపై సైన్య నిపుణులు సహా అనేక వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల పదవీకాలం, ర్యాంకుల్లో.. పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, రిస్క్‌లకు వారిని దూరంగా ఉంచుతుందని విమర్శకులు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు