Bharat Bandh Over Agnipath: వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే..

20 Jun, 2022 13:34 IST|Sakshi

అగ్నిపథ్‌ స్కీమ్‌పై దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రాజకీయ పార్టీల నేతలు నేడు(సోమవారం) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా రైల్వేశాఖ ఆర్పీఎఫ్ బలగాలను అప్రమత్తం చేసింది. అంతే కాకుండా భారీగా రైళ్లను రద్దు చేసింది. జూన్ 20న బయల్దేరాల్సిన 736 రైళ్ల ప్రయాణాలను నిలిపివేసినట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహం చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఢిల్లీ-గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

ఇదిలా ఉండగా.. నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు. పంజాబ్‌లో అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం చేస్తే ఆందోళనలను ప్రేరేపించే సమాచారాన్ని సోషల్‌ మీడియా వ్యాప్తి చెందనివ్వకుండా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇక, బీహార్ ప్రభుత్వం పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచింది. ప్రస్తుతం బీహార్‌లోని 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. 

మరోవైపు.. అగ్నిపథ్‌కు నిరసనగా భారత్‌ బంద్‌ నేపథ్యంలో జార్ఖండ్‌లో విద్యా సంస్థలను మూసివేసి, ఈరోజు జరిగే పరీక్షలను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఫరీదాబాద్, నోయిడాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.


ఇది కూడా చదవండి: భారత్‌ బంద్‌ ఎఫెక్ట్‌: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు

మరిన్ని వార్తలు