పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది

10 Nov, 2021 11:29 IST|Sakshi

పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో అరుదైన సంఘటన

రాష్ట్రపతిని ఆశీర్వదించిన ట్రాన్స్‌జెండర్‌

సాక్షి, వెబ్‌డెస్క్‌: ట్రాన్స్‌జెండర్లు.. ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవారే గుర్తుకు వస్తారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నావారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి. 

ట్రాన్స్‌జెండర్‌ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. ఫోక్‌ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజనులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
(చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ)

క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గాను మంజ‌మ్మ జోగ‌తి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే స‌మ‌యంలో మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను త‌న‌దైన స్టైల్లో ఆశీర్వ‌దించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. మంజమ్మ తన చీర కొంగుతో రామ్‌నాథ్‌కు దిష్టి తీసినట్లు చేశారు. 

ఇది వారి స్టైల్లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా మంజమ్మ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారివురిని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచారు మంజమ్మ.
(చదవండి: పిక్‌ ఆఫ్‌ ది డే.. తులసమ్మకు జేజేలు!!)

మంజమ్మ జీవితం..
మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నిలబడి.. నేడు సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు.

ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. ట్రాన్స్‌జెండర్ల సంఘం తమను తాము రేణుకా ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియే జోగప్ప. ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు.

పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి పలు కళారూపాలు, జోగతి నృత్యం, స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు.
(చదవండి: బిగ్‌బాస్‌ 5: ఆ అరగంట ఎలాంటి కట్‌ లేకుండా..)

మంజమ్మ సేవలకు గాను 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత అనగా 2019లో, ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. 

చదవండి: భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను
 

మరిన్ని వార్తలు