ట్రాన్స్‌జెండర్స్‌కు శుభవార్త: ప్రధాని కానుక

18 Feb, 2021 17:01 IST|Sakshi

ప్రధానమంత్రి నియోజకవర్గంలో మూడో వర్గానికి ప్రత్యేక టాయిలెట్స్‌

వారణాసిలో ట్రాన్స్‌జెండర్స్‌ కోసం మరుగుదొడ్లు

వారణాసి: స్త్రీ, పురుషులకు అంటూ ప్రత్యేక టాయిలెట్స్‌ ఉండగా ట్రాన్స్‌జెండర్స్‌ ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పడేవారు. దీనిపై సినిమాల్లో కూడా చాలా కామెడీ సీన్స్‌ పండాయి. అవి నవ్వుకునేందుకు బాగానే ఉన్నా ట్రాన్స్‌జెండర్స్‌కు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు. ఇకపై వారికి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా టాయిలెట్‌ను నిర్మించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ టాయిలెట్‌ నిర్మించారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్‌ను అధికారులు నిర్మించారు.


రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ టాయిలెట్‌ను గురువారం మేయర్‌ మృదుల జైస్వాల్‌ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోనే ఇది మొదటి ట్రాన్స్‌జెండర్‌ టాయిలెట్‌ అని మేయర్‌ తెలిపారు. వారికి అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్‌ను నిర్మించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ టాయిలెట్లు ట్రాన్స్‌జెండర్ల కోసం మాత్రమేనని.. ఇతరులు వినియోగించరాదని వారణాసి మున్సిపల్‌ కమిషనర్‌ గౌరంగ్‌ రతి విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మూడో వర్గానికి మరో నాలుగు టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మరుగుదొడ్డి నిర్మాణం పట్ల ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారణాసి మున్సిపల్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇన్నాళ్లు తాము పడ్డ ఇబ్బందులు ఇకపై తొలగిపోనున్నాయి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా మా కోసం టాయిలెట్స్‌ నిర్మించాలి’ అని ట్రాన్స్‌జెండర్‌ రోహణి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు