మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’

16 Feb, 2021 15:56 IST|Sakshi

బిడ్డను కనడం వీర్యాన్ని భద్రపర్చిన ట్రాన్స్‌వుమెన్‌

పుట్టబోయే బిడ్డకు బయోలాజికల్‌ తల్లి, తండ్రి ఒక్కరే

గాంధీనగర్‌: గుజరాత్‌, అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్జిస్నూర్‌ దయారా రాష్ట్రం నుంచి వైద్య విద్యనభ్యసించిన తొలి ట్రాన్స్‌ వుమెన్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుని మరో సారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మహిళగా మారనున్న దయారా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  స్త్రీ జన్మకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే మాతృత్వాన్ని అనుభూతి చెందడం కోసం తన వీర్యాన్ని భద్రపరుచుకున్నారు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ఆమె బిడ్డను కనాలని భావిస్తున్నారు. ఇలా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు. ఒకే జన్మలో ఆమె మగాడిగా, స్త్రీగా జీవించనున్నారు. అదే విధంగా తొలిసారి ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతుండటం విశేషం. 

ఈ సందర్భంగా దయారా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, అక్కలాగా చీర కట్టుకోవాలని.. లిప్‌స్టిక్‌ వేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఎంబీబీఎస్‌ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాంటి వారు ఎంతో ధైర్యంగా.. తమకు నచ్చినట్లు బతకడం చూశాను. నాలో ధైర్యం వచ్చింది. భయాల్ని తొలగించుకున్నాను. నాకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టాను. చీర కట్టుకోవడం, లిప్‌స్టిక్‌ వేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను చూసి మొదట నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టు ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది’’ అంటూ చెప్పుకొచ్చారు దయారా. 

తల్లి అవ్వడం నా కల
‘‘ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీస్‌ చేయడం కోసం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతున్నాను. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా నేను పూర్తిగా స్త్రీగా మారతాను. ఆడవారికి లభించిన అద్భుతమైన వరం ఓ జీవికి జన్మనివ్వడం. నేను కూడా ఆ వరాన్ని అందుకోవాలని భావిస్తున్నాను. మాతృత్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్సకు ముందే నా వీర్యాన్ని భద్రపరుచుకోవాలని భావించాను. ఇందుకు గాను అహ్మదాబాద్‌, ఆనంద్‌లోని ఓ ఐవీఎఫ్‌ ఆస్పత్రిని సంప్రదించి.. నా కోరికను వారికి చెప్పాను. నా నిర్ణయాన్ని గౌరవించిన వారు నా వీర్యాన్ని భద్రపరిచేందుకు అంగీకరించారు. వారికి ఎంతో రుణపడి ఉంటాను’’ అన్నారు దయారా.

సరోగసి ద్వారా బిడ్డను కంటాను
‘‘కాళీ మాతా దయ వల్ల నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. అలా జన్మించే బిడ్డకు బయాలజీకల్‌గా నేనే తల్లి, తండ్రి. ఈ విషయం తలుచుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. బిడ్డను కనడం కోసం నేను సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నాను. ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు. ట్రాన్స్‌ వుమెన్‌గా మారిన వ్యక్తి.. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో ధైర్యం కావాలి. చుట్టూ ఉన్న సమాజం కూడా ట్రాన్స్‌జెండర్స్‌ పట్ల దయతో వ్యవహరించాలి’’ అని కోరారు. 

ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం: నయనా పటేల్‌
ఇక దయారా వీర్యాన్ని భద్రపరిచిన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ నయానా పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మగాళ్లు, ఇంటికి దూరంగా ఉంటున్న సైనికులు, చాలా కాలం వరకు బిడ్డలు వద్దనుకునే దంపతుల్లోని మగవారు తమ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు. కానీ మొదటిసారి ఓ ట్రాన్స్‌ఉమెన్‌ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకోవడం మా ఆస్పత్రిలో ఇదే మొదటిసారి’’ అన్నారు.

చదవండి: చిన్ని తండ్రీ నిన్ను చూడక...
                  ట్రాన్స్‌... అప్‌డేట్‌ వెర్షన్‌

మరిన్ని వార్తలు