ఆందోళన అవసరం లేదు.. నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదు 

13 May, 2021 00:51 IST|Sakshi

ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సతీష్‌ తారే 

న్యూఢిల్లీ: బిహార్‌లోని గంగా నదిలో భారీ సంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లక్షలాది మందికి గంగా నదే జీవనాధారం. ఈ నది నీటిని ఉపయోగిస్తే కరోనా వైరస్‌ సోకుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యమునా నదిలో కూడా కరోనా బాధితుల శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆందోళన అవసరం లేదని, నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఐఐటీ–కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సతీష్‌ తారే బుధవారం చెప్పారు.

కరోనా సోకిన వారి మృతదేహాలను నదిలో వదిలేస్తే నీటి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది అనడానికి గట్టి ఆధారాల్లేవని గుర్తుచేశారు. గంగా, దాని ఉప నదుల్లో శవాలను వదిలేయడం కొత్తేమీ కాదని, 10–15 ఏళ్లలో ఇది గణనీయంగా తగ్గిందని అన్నారు. నదిలో శవాలను వదిలేస్తే నదీ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. నది నీటి ఉపయోగించుకునేవారు శుద్ధి చేసుకొని వాడుకోవాలని సూచించారు. నీటి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన అవసరం లేదని నీతి ఆయోగ్‌ (హెల్త్‌) వి.కె.పాల్, ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కె.విజయ రాఘవన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. 

చదవండి: ('సెకండ్‌ వేవ్‌ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది')

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు