వీడియో: టికెట్లు ఉన్నాసరే.. మల్టీప్లెక్స్‌లోకి గిరిజన కుటుంబం అడ్డగింత.. జరిగింది ఇదే!

31 Mar, 2023 09:51 IST|Sakshi

Tribal Video: చెన్నైలోని ఓ పాపులర్‌ మల్టీప్లెక్స్‌ కమ్‌ షాపింగ్‌ మాల్‌ సిబ్బంది తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా చూసేందుకు వెళ్లిన ఓ గిరిజన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాళ్లను స్క్రీన్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మల్టిప్లెక్స్‌ మేనేజ్‌మెంట్‌ వివరణ ఇచ్చుకుంది. 

చెన్నైలోని రోహిణి సిల్వర్‌ స్క్రీన్స్‌లో శింబు నటించిన ‘పాతు తల’ చిత్రం నడుస్తోంది. ఇంతలో ఓ కుటుంబం టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లేందుకు యత్నించింది. అయితే.. వాళ్ల అవతారం,  వేషధారణ చూసి థియేటర్‌ సిబ్బంది వాళ్లను లోపలికి అనుమతించలేదు. టికెట్లు ఉన్నా అనుమతించకపోవడంపై ఆ కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 

ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. గిరిజనులపై వివక్ష ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ట్విటర్‌, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యి హక్కుల సాధన ఉద్యమకారుల నుంచి విమర్శలకు తావిచ్చింది. ఇంకోపక్క నారికురవర్‌(ఆ కుటుంబం ఈ వర్గానికి చెందిందే) తెగ పెద్దలు సైతం ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించేందుకు యత్నించారు. అయితే.. 

ఈలోపే సదరు మల్లిప్లెక్స్‌ నిర్వాహకులు ఘటనపై వివరణ ఇచ్చారు. పాతు తల చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ బై ఏ U/A సర్టిఫికెట్‌ ఇచ్చింది. కాబట్టి, 12 ఏళ్లలోపు వాళ్లు సినిమా చూసేందుకు అనుమతి లేదు. ఆ లెక్కన ఆ కుటుంబంలో రెండు, ఆరు, ఎనిమిది, పదేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అందుకే లోపలికి అనుమతించలేదు. అంతేతప్ప.. అక్కడ ఎవరినీ అవమానించలేదు. ఈలోపు కొందరు గుమిగూడి గూడడంతో.. పరిస్థితి చెయ్యి దాటకూడదన్న ఉద్దేశంతో వాళ్లను సినిమా చూసేందుకు అనుమతించాం అంటూ ఆ కుటుంబం వీడియో చూస్తున్న వీడియోను నెట్‌లో పోస్ట్‌ చేశారు. 

ఇదిలా ఉంటే.. ఓ గిరిజన మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్‌ 341 కింద ఇద్దరు థియేటర్‌ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయగం గమనార్హం. మరోవైపు సినీ ప్రముఖులు సైతం ఈ వీడియోపై స్పందించారు. ఈ వ్యవహారంలో థియేటర్‌ సిబ్బంది తీరుపై సింగర్‌ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేయగా.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌, వ్యవహారం అప్పుడే సర్దుమణిగిందని, వాళ్లను సినిమా చూసేందుకు మేనేజ్‌మెంట్‌ అనుమతించిందంటూ రీట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: రియల్‌ కాంతార.. భూత కోల చేస్తూ కుప్పకూలాడు పాపం

మరిన్ని వార్తలు