టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్‌ చేసిన బీజేపీ

29 Mar, 2021 11:35 IST|Sakshi

కోల్‌​కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎం‌సీ), బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.  సోషల్‌ మీడియాలో సైతం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్‌ ఎంపీ నుస్రత్ జహాన్ కు సంబంధించిన వీడియో చర్చనీయాంశమైంది. పార్టీకి  గంట కంటే  ప్రచారం చేయలేనని, సీఎం కోసం కూడా అంత సమయం కేటాయించలేను అన్నట్లుగా నుస్రత్‌ వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియోను  బీజేపీ బెంగాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

ఈ సందర్భంగా, సొంత పార్టీకి ఎన్నికల్లో సరైన ప్రచారం చేయలేని స్థితిలో టీఎంసీ పార్టీ ఎంపీలు ఉన్నారని విమర్శించింది. అంతేకాకుండా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోతున్నారని బీజేపీ జోస్యం చెప్పింది. కాగా, ఇరు పార్టీల నుంచి నందిగ్రామ్‌ నియోజకవర్గంలో స్టార్‌ క్యాంపెయినర్లను దించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల అసెంబ్లీ ఎన్నికలలో మొదటి విడత పోలింగ్‌ శనివారం ముగిసింది, 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 1 న జరగనుంది.​​ ఓట్ల లెక్కింపు మే 2 న జరుగనుంది.

చదవండి: హత్రాస్‌ కంటే బెంగాల్‌ ఎన్నికలే ముఖ్యమా?

మరిన్ని వార్తలు