దీదీకి మరో షాక్‌.. ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్‌

8 Mar, 2021 19:51 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తృణమూల్‌ నేతలు వరుస పెట్టి కాషాయ కండువా కప్పుకుంటున్న విషయం‍ విధితమే. తాజాగా సోమవారం ఐదుగురు తృణమూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్‌ సర్దార్‌, దీపేందు బిశ్వాస్‌, రవీంద్రనాథ్‌ భట్టాచార్య, జతు లహిరిలు కమల దళంలో చేరి దీదీకి గట్టి షాకిచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్‌పూర్‌ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోటీపడి మరీ టికెట్‌ తెచ్చుకున్న అభ్యర్ధులు కూడా పార్టీని వీడుతుండంతో దీదీకి పాలుపోవడం లేదు.

పార్టీ ఫిరాయించిన నేతలంతా రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌, అగ్ర నేతలు సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాషాయ పార్టీలో చేరడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా మారింది. గతవారం బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్‌ త్రివేది బీజేపీలో చేరగా, ఇటీవల కోబ్రా మిథున్‌ చక్రవర్తి కూడా కమలదళంలో చేరారు. కాగా, 291 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 మధ్య ఎనిమిది విడతల్లో పోలింగ్‌ జరగనుంది. 
 

మరిన్ని వార్తలు