‘రాష్ట్రపతిపై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’.. మంత్రి అఖిల్‌ గిరిపై టీఎంసీ ఫైర్‌

12 Nov, 2022 13:33 IST|Sakshi

కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్‌ మంత్రి అఖిల్‌ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో వివాదాస్పదమైన నేపథ్యంలో విపక్షాలు అధికార టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై స్పందించింది తృణమూల్‌ కాంగ్రెస్‌. ఆయన తీరు బాధ్యతారాహిత్యమేనని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతిని సాకెత్‌ గోఖలే ట్వీట్‌ చేశారు.

‘ఇది బాధ్యతారాహిత్యంగా చేసిన కామెంట్‌. ఆ వ్యాఖ్యలతో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదు. మేము భారత రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నాం. మేము ఆమెను, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తాం.’ అని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి సాకెత్‌ గోఖలే. 

మంత్రి క్షమాపణలు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన క్రమంలో క్షమాపణలు చెప్పారు టీఎంసీ మంత్రి అఖిల్‌ గిరి. ‘రాష్ట్రపతిని నేను చాలా గౌరవిస్తాను. సువేందు అధికారికి సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించా. ఎవరి పేరును చెప్పలేదు. ఆయన అఖిల్‌ గిరి చాలా అంద వికారంగా ఉంటారని చెప్పారు. నేను ఒక మంత్రిని. నాగురించే ఏదైనా చెడుగా చెబితే.. అది రాజ్యాంగానికే అవమానం. నేను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ, ఎవరి పేరు చెప్పలేదు. దీనిని భారత రాష్ట్రపతి అవమానంగా భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా. నేను చెప్పినదానికి పశ్చాతాపపడుతున్నా.’ అని పేర్కొన్నారు మంత్రి అఖిల్‌ గిరి. 

ఇదీ చదవండి: వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్‌

మరిన్ని వార్తలు