నాపై నిఘా పెట్టారు.. భద్రత అక్కర్లేదు: టీఎంసీ ఎంపీ

13 Feb, 2021 20:25 IST|Sakshi

మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. తనకు భద్రత కావాలని కోరలేదని.. కానీ తన నివాసం వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్లను మోహరించారని వెల్లడించారు. ఇంత సడెన్‌గా తన ఇంటి వద్ద బీఎస్‌ఎఫ్‌ అధికారులను నియమించడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో తెలిపారు. సాధారణ పౌరురాలిగా ఉండాలని కోరకుంటున్నాను. నాకు ఎలాంటి భద్రత వద్దన్నారు మహువా.

ఇక బీఎస్‌ఎఫ్‌ కదలికలు చూస్తుంటే తనపై నిఘా ఉంచినట్టు అనిపిస్తోందంటూ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ఎన్‌ శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు మహువా మొయిత్రా. శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తన అధికారిక నివాసానికి ఎస్‌హెచ్‌వో వచ్చారనీ.. ఆ తర్వాత రాత్రి 10గంటల సమయంలో ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ అధికారులను ఇంటి బయట ఉంచినట్టు లేఖలో తెలిపారు. తన భద్రత కోసమే వచ్చినట్టు జవాన్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఈ దేశ సాధారణ పౌరురాలిగా ఉండాలనుకుంటున్నానన్న మహువా.. తనకు భద్రత కావాలని ఎవరినీ అడగలేదన్నారు. తన ఇంటి వద్ద ఉన్న జవాన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీసులను కోరారు. ఈ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తనను కాపాడేందుకే ప్రజా ధనాన్ని వృథా చేయొద్దని సూచించారు. అందరికీ రక్షణ కల్పించాలి తప్ప తనకేమీ ప్రత్యేకంగా అవసరం లేదన్నారు మహువా. తనపై నిఘా పెట్టాలంటే తనను అడగాలని, తానే చెబుతానని తెలిపారు. మహువా బెంగాల్‌లోని కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు