ఇప్పుడు నిజమైన ‘పప్పు’ ఎవరు?: టీఎంసీ ఎంపీ ఫైర్‌

14 Dec, 2022 09:06 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్‌ గ్రాంట్స్‌ విడుదలపై లోక్‌సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు టీఎంసీ ఎంపీ. 

‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్‌లో 5.6 శాతం మేర క్షీణించింది. 

మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పేరెంట్స్‌ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్‌.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు

మరిన్ని వార్తలు