ఆర్థిక మంత్రిపై తృణమూల్‌ వ్యక్తిగత వ్యాఖ్యలు

14 Sep, 2020 14:58 IST|Sakshi

రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై విపక్ష సభ్యుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. విపక్ష సభ్యుడి అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సమసిపోయింది. నిర్మలా సీతారామన్‌పై తృణమూల్‌ ఎంపీ సౌగత రాయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పట్టుబట్టారు. లోక్‌సభలో సోమవారం బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సౌగత రాయ్‌ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక దుస్థితి నిర్మలా సీతారామన్‌ కష్టాలను పెంచిందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన మీదట వీటిని రికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. బిల్లును సమర్ధిస్తూ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ సౌగత రాయ్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇతర అంశాలపై వ్యాఖ్యలు చేయకుండా సౌగత రాయ్‌ సభా కార్యకలాపాలను వినాలని అన్నారు. సీనియర్‌ సభ్యురాలిపై రాయ్‌ వ్యాఖ్యలను పాలక పక్ష సభ్యులు తప్పుపట్టారు. ఇది మహిళా సభ్యురాలిని అవమానించడమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అన్నారు. కాగా తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయలేదని సౌగత్‌ రాయ్‌ చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

చదవండి : ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా

>
మరిన్ని వార్తలు