కమలంలో కలకలం: సీఎంపై తిరుగుబాటు

12 Oct, 2020 08:41 IST|Sakshi

సీఎం అనుచిత వ్యాఖ్యలతో పార్టీకే ప్రమాదం

తిరుగుబాటుదారులంతా కాంగ్రెస్‌ నుంచి వచ్చారు

న్యూఢిల్లీ: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కుమార్‌ను సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీ అప్రదిష్టపాలవుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీకి చేరారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ఆరోగ్య, హెవీ వెయిట్‌ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదీప్‌ రాయ్‌ బార్మన్‌ నేతృత్వంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలానే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీలను కూడా కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా ఢిల్లీలోని త్రిపుర భవన్‌లో క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘మేం దాదాపు 12 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. రాష్ట్రంలో నెలకొన్న నియంతృత్వ, పేలవమైన పాలన గురించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. సీఎం వ్యాఖ్యలు, చేతలతో పార్టీ అప్రదిష్ట పాలవుతుంది’ అన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కితగ్గిన విప్లవ్‌ దేవ్)

‘ఇప్పటికే పలు అంశాల గురించి ముఖ్యమంత్రి తర అనుచిత వ్యాఖ్యలతో పార్టీని అనేక సార్లు ఇబ్బందుల్లో పడేశారు. ఇక రాష్ట్రంలో కోవిడ్‌-19 సంక్షోభ నిర్వహణ పేలవంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య మంత్రి లేరు. దాంతో త్రిపురకు ఓ కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరతాం. ఇక అనుభవజ్ఞులైన ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు డిప్యూటేషన్‌, స్వచ్ఛంద పదవీ విరమణతో రాష్ట్రాన్ని వీడుతున్నారు. కారణం ఏంటంటే వారు ముఖ్యమంత్రి నియంతృత్వ స్వభావాన్ని భరించలేకపోతున్నారు. ఆఖరికి మీడియాను కూడా బెదిరించారు. దాంతో పాత్రికేయులు కూడా సీఎంకు వ్యతిరేకంగా ముందుకొచ్చారుఝ’ అని తెలిపాడు. అంతేకాక ‘మేమంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండే కార్యకర్తలం అని జాతీయ నాయకత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో బీజేపీ దీర్ఘకాలం పదవిలో ఉండాలని భావిస్తున్నాం. కానీ ప్రస్తుత నాయకత్వం కొనసాగితే.. వామపక్షాలు, కాంగ్రెస్‌ వంటి ప్రతిపక్షాలు బలపడతాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారు’ అని తెలిపాడు. (చదవండి: అమ్మాయిని కలిసేందుకు వచ్చాడని...)

అయితే ఈ వ్యాఖ్యలను విప్లవ్‌ దేవ్‌ ప్రధాన అనుచరులు ఖండించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మండి పడ్డారు. ‘రాష్ట్రంలో పాలన సాజవుగా సాగుతుంది. వీరు అవాంతరాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు పార్టీలో 7-8 మంది ఉంటారు. వీరంతా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారు. బీజేపీ పాత నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలోని నాయకులు విప్లవ్‌ దేవ్‌ నాయకత్వం మీద పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నార’ని తెలిపారు. త్రిపురలో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఇండిజీనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) రాష్ట్రంలో 25 సంవత్సరాల లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని తొలగించి 2018లో అధికారంలోకి వచ్చింది. 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తరఫున 36 మంది, ఐపీఎఫ్‌టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరిన్ని వార్తలు