త్రిపురలో హైటెన్షన్‌.. మాజీ సీఎం పూర్వీకుల ఇంటిపై దాడి, నిప్పు అంటించి..

4 Jan, 2023 07:29 IST|Sakshi

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇంటి బయట పార్క్‌ చేసి ఉన్న కారు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఒక్కసారిగా త్రిపురలో ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఉదయ్‌పూర్‌లోని జామ్‌జూరి ప్రాంతంలోని రాజ్‌నగర్‌లోని బిప్లబ్‌దేవ్‌ పూర్వీకుల ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. మొత్తం ఇంటిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి బయట పార్క్‌ చేసి ఉన్న వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు.. బిప్లవ్‌ దేవ్‌ తండ్రి హిరుధన్‌ దేవ్‌ స్మారకార్థం బుధవారం కావడం కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇలా జరగడం త్రిపురలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. ఈ దాడిపై బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఈ దాడికి సీపీఎం మద్దతుదారులే కారణమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా.. దాడి చేసిన వారితో కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి మంగళవారం సమావేశమైనట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి ఘటన సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని భద్రత ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు