Covid-19 Vaccine: రోడ్డు పక్కన రూ.8 కోట్ల విలువైన టీకాలు

1 May, 2021 17:16 IST|Sakshi
రూ. 8 కోట్ల విలువైన టీకాలున్నట్రక్‌ను రోడ్డు పక్కన వదిలేసిన దృశ్యం(ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన

రోడ్డు పక్కన టీకా ట్రక్కును వదిలేసిన డ్రైవర్‌

భోపాల్‌: దేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్‌ ధాటికి ఇప్పట్లో బ్రేక్‌​ పడేలా కనిపించడం లేదు. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం టీకా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నేడు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. టీకాల కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్‌లో దాదాపు రెండున్నర లక్షల టీకా డోసులు ఉన్న లారీని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు.

ఈ సంఘటన నర్సింగపూర్‌ కరేలి బస్‌ స్టాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది. 2.40 లక్షల కోవాగ్జిన్‌ టీకా డోసులు ఉన్న లారీని కరేలి బస్‌ స్టాండ్‌ దగ్గర రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. డ్రైవర్‌, క్లీనర్‌ ఎక్కడ ఉన్నారో అర్థం కాలేదు. చాలా సేపటి నుంచి ఆ ట్రక్కు అక్కడే ఆగి ఉంది. ఇది గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. ట్రక్కులో భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన 2,40,000 కోవాగ్జిన్‌ టీకాలున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ వదిలేసి వెళ్లిన టీకాల ఖరీదు సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. డ్రైవర్‌ ఆచూకీ కోసం గాలిస్తూ.. అతడి మొబైల్‌ నంబర్‌ని ట్రాక్‌ చేశాం. అది హైవేకు సమీపంలో తుప్పల్లో పడి ఉంది. టైర్లు కూడా పంచర్‌ కాలేదు. ట్రక్‌ కండీషన్‌ చాలా బాగుంది. ప్రస్తుతానికి టీకాలు సేఫ్‌. డ్రైవర్‌, క్లీనర్‌ గురించి దర్యాప్తు చేస్తున్నాం. వారీ ఆచూకీ కోసం గాలిస్తున్నాం’’ అని తెలిపారు.

చదవండి: భారీగా తగ్గిన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధరలు

మరిన్ని వార్తలు