తృప్తి దేశాయ్‌పై ఈ నెల 11వరకు నిషేధాజ్ఞలు

9 Dec, 2020 14:18 IST|Sakshi

ముంబై: సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై షిర్డీ అధికారులు అంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్‌కు షిర్డీ ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గోవింద్ షిండే నోటీసులు జారీ చేశారు. తృప్తి దేశాయ్ ఆలయంలోకి ప్రవేశిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. షిర్డీతో పాటు దాని పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలో కూడా ఆమె ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఆమె తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆలయంలోకి ప్రవేశించడానికి చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, షిర్డీ ఆలయంలోకి వచ్చే భక్తుల సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలని ఆలయ అధికారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిపై తృప్తి దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు ఆ పోస్టర్లను తొలగించాలని.. లేకపోతే తానే ఇతర కార్యకర్తలతో డిసెంబర్ 10న ఆలయం వద్దకు చేరుకుని వాటిని తొలగిస్తానని తృప్తి దేశాయ్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమెకు నోటీసులు జారీచేశారు. (ప్లీజ్‌.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి)

అయితే తమ భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని షిర్డీ ట్రస్ట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. షిర్డీకి వచ్చే కొందరి వస్త్రాధారణపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేవలం షిర్డీ వచ్చేవారికి అభ్యర్థన చేసే విధంగా ఆలయ పరిసరాల్లో పోస్టర్లు అంటించినట్టు చెప్పారు. ఇక, ఈ పోస్టర్లకు సంబంధించి ట్రస్ట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసినట్లు తృప్తి దేశాయ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘దేవాలయం పవిత్రతను ఎలా కాపాడాలో భక్తులకు బాగా తెలుసు. ఈ పోస్టర్లును తొలగించకపోతే.. మేం ఇక్కడికి వచ్చి వాటిని తొలగిస్తాం. డిసెంబర్‌ 10 మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి మేం ఇక్కడకు చేరుకుంటాం’అని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు