Tunnel To Red Fort Found: ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు రహస్య సొరంగం

3 Sep, 2021 11:41 IST|Sakshi

Secret Tunnel In Delhi: ఢిల్లీ శాసనసభ వద్ద రహస్యం సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగం శాసనసభ నుండి ఎర్రకోటను కలుపుతుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ వెల్లడించారు. స్వాతంత్య్ర సమర యోధులను తరలించేందుకు అప్పట్లో బ్రిటీస్‌ పాలకులు దీన్ని వినియోగించేవారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ ప్రదేశం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉన్న దీన్ని పర్యాటకులు ,సందర్శకుల కోసం దీనిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

1993లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఎర్రకోట వరకు వెళ్లే సొరంగం ఉందని వార్తలు వినిపించాయి. దాని చరిత్రను వెతకడానికి ప్రయత్నించాను. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లభించలేదని గోయల్‌ తెలిపారు. అయితే ఆ సొరంగ ద్వారం ఇప్పుడు బయటపడిందని, మెట్రో ప్రాజెక్టులు, మురుగు నీటి వ్యవస్థల కారణంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత తవ్వే ఉద్దేశం లేదని అన్నారు. 1912లో కోల్‌కతా నుండి దేశ రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత, అక్కడ అసెంబ్లీని 1926లో కోర్టుగా మార్చారని, స్వాతంత్య సమర యోధులను కోర్టుకు తీసుకువచ్చేందుకు బ్రిటీషర్లు ఈ సొరంగాన్నే వినియోగించేవారని చెప్పారు. ఉరిశిక్షలకు ఉపయోగించే గది ఉందని తెలుసు కానీ దాన్నేప్పుడూ తెరవలేదన్నారు.

75 వసంతాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా వారికి నివాళిగా ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల మందిరంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఢిల్లీ శాసన సభకు చరిత్ర ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది స్వతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి ఈ గదిని పర్యాటకుల కోసం తెరచి ఉంచాలని భావిస్తున్నానని చెప్పారు.  ఇప్పటికే  సంబంధిత పనులను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు