దంతాలు కోసుకెళ్లి.. ఏనుగును చంపి దహనం చేశారు...

30 Apr, 2021 11:38 IST|Sakshi

వాల్పారై అడవుల్లో ఘటన

సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఏనుగును హతమార్చారు. దంతాల్ని కోసి తీసుకెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా దహనం కూడా చేశారు. కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై ఎస్టేట్‌ కారి్మకులు అడవుల్లో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లారు. సేలయార్‌ డ్యాంపై భాగంలో సురక్షిత ప్రాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. కట్టెలు కొట్టుకుని తిరుగుపయనంలో ఉండగా దుర్వాసన రావడాన్ని గుర్తించారు. ఓ చోట ఏనుగు దహనం చేసిన స్థితిలో పడి ఉండడంతో అటవీశాఖ అధికారి జయచంద్రన్‌కు సమాచారం అందించారు.

ఆయన నేతృత్వంలోని బృందం, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏనుగును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చి, ఆ దంతాలను కోసుకెళ్లి ఉండడం వెలుగు చూసింది. ఆధారాల్ని చెరిపేందుకు ఆ పరిసరాల్లో రసాయనం సైతం పోసి ఉండడం బయటపడింది. ఏనుగును దహనం చేసి ఉండడంతో, 90 శాతం మేరకు గుర్తు పట్టలేని పరిస్థితి. దీంతో అక్కడున్న రసాయనాలు, ఏనుగు మృతదేహంలోని కొంతభాగాన్ని పరిశోధనకు తరలించారు. ఈ కిరాతకానికి పాల్పడ్డ వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

చదవండి: జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ

మరిన్ని వార్తలు