టీవీ చర్చలతోనే ఎక్కువ కాలుష్యం

17 Nov, 2021 17:30 IST|Sakshi

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్య

న్యూఢిల్లీ: అసలు కాలుష్యం కంటే టీవీలో చర్చలే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల చిన్న చిన్న పరిశీలనలు కూడా వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానికి పెనుముప్పుగా మారిన వాయు కాలుష్యంపై ఓ విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈవిధంగా వ్యాఖ్యానించారు. 

‘మీరు ఏదో ఒక సమస్యను లేవనెత్తి.. మమ్మల్ని గమనించేలా చేసి, ఆపై దానిని వివాదాస్పదం చేస్తారు. తర్వాత బ్లేమ్ గేమ్ మాత్రమే మిగిలి ఉంటుంది. టీవీల్లో చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి’ అని జస్టిస్ రమణ అన్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఢిల్లీ వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని సుప్రీంకోర్టును తాను తప్పుదారి పట్టించినట్టు టీవీ చర్చల్లో ఆరోపించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. తమను తప్పుదోవ పట్టించడం లేదన్నారు. (చదవండి: అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?)

ఢిల్లీ కాలుష్యానికి రైతులను నిందిస్తూ, దీపావళి సందర్భంగా పటాకులు పేల్చేందుకు మద్దతు పలుకుతూ కొంతమంది ప్రముఖులు గళం వినిపించిన నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. కాలుష్యానికి కారణమంటూ రైతులను నిందించడం సరికాదని అన్నారు. ‘ఫైవ్ స్టార్, 7 స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులను ఆడిపోసుకుంటున్నారు. అసలు రైతుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా పంట వ్యర్థాలను తొలగించగల స్తోమత వారికి ఉందా? మీకు ఏదైనా శాస్త్రీయ విధానం తెలిస్తే.. వెళ్లి రైతులకు చెప్పండి’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలతో ఢిల్లీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఏకీభవించారు. (చదవండి: ఆకలిచావులు ఉండొద్దు: సుప్రీంకోర్టు)  

మరిన్ని వార్తలు