అనుచిత ట్వీట్‌పై అరెస్ట్‌.. పోలీసుల ఓవరాక్షన్‌ అంటున్న హీరో భార్య

23 Feb, 2022 19:40 IST|Sakshi

హిజాబ్‌ వ్యవహారంలో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ హీరో చేతన్‌ కుమార్‌ అహింసాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బెయిల్‌ దొరక్కపోవడంతో.. రెండురోజులు జైల్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అతనికి. 

కన్నడనాట హిజాబ్‌ వివాదం నడుస్తుండగా.. నటుడు చేతన్‌ చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ.  సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్‌ చేసి లోకల్‌ మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. ‘‘హిజాబ్‌ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్‌ పైనే చేతన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్‌ అభ్యర్థించారు. దీంతో జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన కోర్టు.. శుక్రవారానికి బెయిల్‌ పిటిషన్‌ పరిశీలిస్తామని తెలిపింది.


చేతన్‌ చేసిన ట్వీట్‌గా వైరల్‌ అవుతోంది ఇదే

అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్‌ చేశారని చేతన్‌ భార్య మేఘ ఆరోపిస్తోంది. చేతన్‌ అరెస్ట్‌ విషయంలో పోలీసులు అతిప్రదర్శించారన్నది ఆమె వాదన. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి.. తన భర్తనే ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఆమె. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. చేతన్‌ వ్యవహారం హిజాబ్‌ అంశంలో కొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హర్ష అరెస్ట్‌ను.. హిజాబ్‌కు ముడిపెట్టడం, ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం చూశాం. ఈ తరుణంలో చేతన్‌ మద్దతుదారులంటూ కొందరు శేషాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌ బయట ఆందోళనచేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్​.. డజన్​కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్​.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్​ గిఫ్ట్​గా అందించి వార్తల్లో నిలిచాడు. డజనుకుపైగా సినిమాల్లో నటించిన చేతన్‌.. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా.

మరిన్ని వార్తలు