Twin Sisters Letter To PM Modi: ప్రధాని మోదీకి కవల అక్కాచెల్లెళ్ల భావోద్వేగ లేఖ

27 Feb, 2024 07:38 IST|Sakshi

అర్చిత, అర్చన రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన కవల సోదరీమణులు. వీరు తమ తల్లిదండ్రుల  ఉద్యోగ బదిలీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. అర్చిత, అర్చనల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. వీరిద్దరికీ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యింది. గతంలో వీరు తమ కుమార్తెల చదువు కోసం జైపూర్‌లో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అయితే వీరి తల్లిదండ్రులకు వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం వీరు దౌసాలో వారి అత్త ఇంటిలో ఉంటున్నారు.

అర్చిత, అర్చన తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో తెలియజేశారు. తమ తల్లిదండ్రులను జైపూర్‌కు బదిలీ చేయాలని వారు కోరారు. ఈ భావోద్వేగ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఏమున్నదంటే..

‘నా పేరు అర్చిత, అక్క పేరు అర్చన. మా ఇద్దరి వయసు 12 ఏళ్లు. మేమిద్దరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినులం. మేమిద్దరం మా అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాం. మా నాన్న పేరు దేవపాల్ మీనా, అమ్మ పేరు హేమలత కుమారి మీనా. మా నాన్న పంచాయితీ సమితి చౌతాన్‌లో అసిస్టెంట్ అకౌంట్స్  ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 

మా అమ్మ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్, బలోత్రాలో టీచర్‌. వారికి ఉద్యోగ బదిలీ అయిన కారణంగా మేమిద్దరం  మా తల్లిదండ్రులను చాలా మిస్ అవుతున్నాం. వారు లేకుండా మాకు చదువుకోవాలని అనిపించడం లేదు. మా తల్లిదండ్రులను జైపూర్‌కి బదిలీ చేయాలని కోరుతున్నాం.
బేటీ బచావో, బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పలు ప్రచారాలను మేము విన్నాం. మేము వీటి నుండి చాలా ప్రేరణ పొందాం. దయచేసి మా తల్లిదండ్రులను  జైపూర్‌కు బదిలీ చేయండి’ అని కోరారు.  

అర్చిత, అర్చన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బదిలీ చేయడం అంత సులభం కాదు. అయితే ఈ చిన్నారుల సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ  దృష్టి సారిస్తారా? లేదా రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్ శర్మ ఈ పిల్లల ఆవేదనపై దృష్టి సారిస్తారా? అనేది వేచి చూడాలి.

whatsapp channel

మరిన్ని వార్తలు