Noida Twin Towers: ‘అఖిలేశ్‌ ప్రభుత్వ అవినీతికి ‘ట్విన్‌ టవర్స్‌’ సజీవ సాక్ష్యం’

28 Aug, 2022 16:23 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్‌జోన్‌లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్‌ప్రదేశ్‌ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్‌, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష‍్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

నోయిడా ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య. ‘సమాజ్‌ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్‌ టవర్స్‌ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. 

డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్‌ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్‌టెక్‌ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్‌ అందుకు బ్రోకరేజ్‌ అందుకున్నాడు.’ అని ఆరోపించింది.

ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్‌ టవర్స్‌ .. 9 సెకన్లలోనే..

మరిన్ని వార్తలు