సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నించిన వాజే

16 Mar, 2021 14:03 IST|Sakshi
సచిన్‌ వాజే (ఫైల్‌ ఫోటో)

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న వాజే ఘనకార్యాలు

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో​ కూడిన స్కార్పియోని నిలిపి కలకలం సృష్టించిన ఘటనలో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తొలత ఈ కేసును ముంబై ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ కేసుతో వాజేకు ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఈ కేసుకు సంబంధించి వాజే మీద కేసు బుక్‌ చేసింది. అలానే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ కూడా వాజేను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వాజే ఈ కేసు దర్యాప్తులో సమయంలో సేకరించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాజే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సేకరించిన ఆధారాలను రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. అలానే సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన సీసీటీవీ ఫుటేజ్‌, డీవీఆర్‌ మెషన్‌ డాటాతో పాటు తాను సేకరించిన ఇతర సమాచారాన్ని నాశనం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ప్రసుత్తం అధికారులు డిలీట్‌ అయిన డాటాను రిట్రీవ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగలించబడిందని గుర్తించారు. ఆ తర్వాత  హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజేనే ఆ తర్వాత.. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహంచడంతో అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు.

చదవండి:
అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం

అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు

మరిన్ని వార్తలు