పార్లమెంటరీ కమిటీ ఎదుట ట్విటర్‌ క్షమాపణ

29 Oct, 2020 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లేహ్‌, జమ్ము కశ్మీర్‌లను చైనాలో భాగంగా ప్రత్యక్ష ప్రసారంలో లొకేషన్‌ ట్యాగ్‌లో చూపడం పట్ల ట్విటర్‌ ఇండియా గురువారం వ్యక్తిగత సమాచార పరిరక్షణపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట క్షమాపణలు కోరింది. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ కమిటీ సోషల్‌ మీడియా దిగ్గజం లిఖితపూర్వక క్షమాపణ చెప్పడంతో పాటు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది. భారత భూభాగాన్ని చైనాలో భాగంగా చూపుతూ ట్విటర్‌ భారత సార్వభౌమాధికారం పట్ల అగౌరవం కనబరిచిందని సంయుక్త పార‍్లమెంటరీ కమిటీ చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ పొరపాటును తక్షణమే సరిదిద్దామని ట్విటర్‌ వివరణ ఇచ్చింది.

గత వారం వెలుగులోకి వచ్చిన ఈ తప్పిదాన్ని కంపెనీ సత్వరమే పరిష్కరించిందని పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ట్విటర్‌ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. ట్విటర్‌ వివరణ సరిపోదని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా పేర్కొందని కమిటీ చీఫ్‌, పాలక బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు. లడఖ్‌ను చైనా భూభాగంగా చూపడం నేరపూరిత చర్యతో సమానమని ఆమె స్పష్టం చేశారు. దేశ మ్యాప్‌లో ఇలాంటి తప్పులను ప్రభుత్వం ఏమాత్రం సహించదని ట్విటర్‌ సీఈఓ జాక్‌ డార్సీకి రాసిన లేఖలో ఎలక్ర్టానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ సాహ్నీ పేర్కొన్నారు. చదవండి : షారూక్‌లా అవ్వాలంటే ఏం తినాలి?

మరిన్ని వార్తలు