కాంగ్రెస్‌ – ట్విట్టర్‌ వార్‌

13 Aug, 2021 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ, సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధికారిక అకౌంట్, పార్టీ నేతలు, కార్యకర్తల ఖాతాలను ట్విట్టర్‌ బ్లాక్‌ చేసిందని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఢిల్లీలో అత్యాచారం, హత్యకి గురైనట్టుగా అనుమానిస్తున్న దళిత బాలిక కుటుంబం ఫొటోలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఇటీవల ట్విట్టర్‌లో షేర్‌ చేసినందుకు ఆయన ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ఖాతాని బ్లాక్‌ చేయడంతో ఆ పార్టీ ట్విట్టర్‌పైనా, కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా విరుచుకుపడింది. కేంద్రం ఆదేశాల మేరకే ట్విట్టర్‌ ఇలా వ్యవహరిస్తోందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఆరోపించారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు సుర్జేవాలా, అజయ్‌ మాకెన్, లోక్‌సభలో పార్టీ విప్‌ మాణిక్యం ఠాగూర్,   మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మిత దేవ్‌ తదితరుల ఖాతాలను ట్విట్టర్‌ నిలిపివేసింది. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు చెందిన మొత్తంగా 5,000 ఖాతాలను ట్విట్టర్‌ స్తంభింపజేసిందని కాంగ్రెస్‌ సోషల్‌మీడియా విభాగం చీఫ్‌ రోహన్‌ గుప్తా అన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ నేతల అకౌంట్లు బ్లాక్‌ చేసే అంశంలో ఆ సంస్థ తన సొంత నిబంధనలు పాటిస్తుందా  లేదంటే మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటుందా అని ప్రశ్నించారు. కాగా, ట్విట్టర్‌ తమ చర్యల్ని సమర్థించుకుంది.

మరిన్ని వార్తలు