‘పిట్ట’ పిచ్చి పరాకాష్ఠకు..!

29 Jun, 2021 03:58 IST|Sakshi
ట్విట్టర్‌ వెబ్‌సైట్‌లో ఉన్న భారత్‌ మ్యాప్‌

జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశంగా చూపిన ట్విట్టర్‌

ట్విట్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వెల్లువెత్తిన డిమాండ్లు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ అన్ని హద్దులు దాటుతోంది. భారత ప్రభుత్వంతో గత కొన్ని నెలలుగా తలపడుతున్న ట్విట్టర్‌.. తాజాగా, మరోసారి కట్టుదాటి ప్రవర్తించింది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా తన వెబ్‌సైట్‌లోని ప్రపంచ చిత్రపటంలో చూపింది. ట్విట్టర్‌ వెబ్‌సైట్‌లోని ‘కెరియర్‌ సెక్షన్‌’లో పోస్ట్‌ చేసిన ప్రపంచ పటంలో ట్విట్టర్‌ ఈ దుందుడుకుతనం చూపింది.

ట్విట్టర్‌ తీరుపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తక్షణమే ట్విట్టర్‌ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. చివరకు ఆ మ్యాప్‌ను ట్విట్టర్‌ తొలగించింది. భారత చిత్రపటంలో మార్పులు చేయడం ట్విట్టర్‌కు ఇది తొలిసారి కాదు. గతంలో లద్దాఖ్‌లోని లేహ్‌ ప్రాంతాన్ని చైనా దేశంలో అంతర్భాగంగా చూపింది. భారత్‌ తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్‌ కొన్నాళ్లుగా ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే.

కావాల్సినంత సమయం ఇచ్చినప్పటికీ భారత ఐటీ చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ట్విట్టర్‌కు భారత్‌లో చట్టబద్ధ రక్షణ కల్పించే ‘ఇంటర్మీడియరీ హోదా’ను సైతం మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తొలగించడం తెల్సిందే. దీంతో, ట్విట్టర్‌లో పోస్ట్‌ అయ్యే సంఘవ్యతిరేక అంశాలకు సంబంధించి ఆ సంస్థే నేరుగా చట్టబద్ధ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అక్టోబర్‌ నెలలో లేహ్‌లో జరిగిన ఒక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఆ ప్రాంతాన్ని చైనాలో భాగంగా ట్విట్టర్‌ తన జియోట్యాగింగ్‌లో చూపింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం కూడా ట్విట్టర్‌కు గట్టిగా హెచ్చరించింది.

భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. గత నవంబర్‌లోనూ లేహ్‌ను లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా కాకుండా, జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతంగా ట్విట్టర్‌ చూపింది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు పంపించింది. మ్యాప్‌ల్లో తప్పులు లేకుండా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. మే 26 నుంచి నూతన ఐటీ నిబంధనల మేరకు ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న, భారత్‌లోనే నివసించే గ్రీవెన్స్‌ ఆఫీసర్, నోడల్‌ ఆఫీసర్‌లను నియమించాలన్న ఆదేశాలను సైతం ట్విట్టర్‌ బేఖాతరు చేసింది. తాజాగా, శుక్రవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విట్టర్‌ ఖాతాను గంటపాటు స్తంభింపజేసింది. ట్విట్టర్‌ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం సమయం నుంచి ట్విట్టర్, కేంద్రం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తలు