Digital Rules: ట్విటర్‌కు ఫైనల్‌ వార్నింగ్‌

5 Jun, 2021 14:01 IST|Sakshi

ట్విటర్‌కు  కేంద్రం తుది హెచ్చరిక

ఎగ్జిక్యూటివ్‌ల నియామకంలో నిబంధనలు పాటించాల్సిందే!

లేదంటి తదుపరి చర్యలకు సిద్ధంకండి!

సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్‌ సైట్‌ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీచేసింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల నియామకంలో కొత్త ఐటీ నిబంధనలను పాటించాలని మరోసారి గట్టిగా ఆదేశించింది. ఇదే అవకాశమని, లేదంటే తదనంతర పరిణామాలను సిద్ధంగా ఉండాలని కేంద్రం శనివారం హెచ్చరించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్‌ ఖాతాకు బ్లూటిక్‌ తొలగింపు వివాదం తరువాత తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం, ట్విటర్‌ వార్‌ మరింత ముదురుతోంది.

దేశ ఐటీ నిబంధనలను తక్షణమే పాటించేలా ట్విటర్‌కు నోటీసులిచ్చామని కేంద్రం ప్రకటించింది. ఐటీ నిబంధనల ప్రకారం దేశీయంగా అధికారులను నియమించేందుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది.  నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇప్పటివరకు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ వివరాలను అందించలేదని ట్విటర్‌కు ఇచ్చిన నోటీసులో కేంద్రంపేర్కొంది. నామినేట్ చేసిన రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ అండ్‌ నోడల్ కాంటాక్ట్ పర్సన్ ట్విటర్‌ ఉద్యోగి కాదని కూడా హైలైట్ చేసింది.  అలాగే  ట్విటర్‌ చిరునామా నిబంధనల ప్రకారం కూడా లేదని వ్యాఖ్యానించింది.  సరైన సమాచారం అందించలేదని మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ  నిబంధనల అమలు విషయంలో విఫలమైతే ఐటీ చట్టం 2000, సెక్షన్ 79 ప్రకారం లభించే మినహాయింపులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. దీని ప్రకారం సంబంధిత పరిణామాలు, జరిమానా చర్యలకు ట్విటర్‌ బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చదవండి: Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్‌ తొలగింపు
Twitter ban: అధ్యక్షుడి ట్వీట్‌ తొలగింపు, నిరవధిక నిషేధం

మరిన్ని వార్తలు