ట్విట్టర్‌పై కేసుల వెల్లువ

30 Jun, 2021 01:14 IST|Sakshi

ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన యూపీ, ఎంపీ, ఢిల్లీ పోలీసులు  

నోయిడా/ ఢిల్లీ: కేంద్రంతో ధిక్కార ధోరణి అవలంబిస్తున్న సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌పై మంగళవారం మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ట్విట్టర్‌ ఎండీపై యూపీ, ఎంపీ పోలీసులు కేసులు నమోదు చేయగా, ట్విట్టర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్‌సైట్లో ఓ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించినందుకు గానూ ట్విట్టర్‌ సీనియర్‌ అధికారులపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు, మధ్య ప్రదేశ్‌ పోలీసులు వేరువేరుగా కేసులు నమోదు చేశారు. సంస్థ ప్లాట్‌ఫామ్‌పై పిల్లల నీలిచిత్రాలకు యాక్సెస్‌ ఇస్తున్నందుకు న్యూఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

భారత చిత్రపటాన్ని తప్పుగా చూపారని భజరంగ్‌దళ్‌ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీశ్‌ మహేశ్వరితో పాటు న్యూస్‌ పార్టనర్‌ షిప్స్‌ హెడ్‌ అమృతా త్రిపాఠిపై యూపీలోని ఖుర్జానగర్‌ పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 505–2, ఐటీ చట్టం 74 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇదే అంశంపై బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తప్పుడు మ్యాపింగ్‌ అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని ఎంపీ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

భారత్‌కు సంబంధించి తప్పుడు మ్యాప్‌ను ట్విట్టర్‌ సోమవారం తన వెబ్‌సైట్లో ప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఖాతాలను ఇటీవల బ్లాక్‌ చేయడంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది.   

 

చదవండి: Prashant Bhushan: వ్యాక్సిన్‌ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు