దేశంలో ట్విటర్‌ తొలి యూజర్‌ ఎవరో తెలుసా? ఈమెనే! ట్విటర్‌ మార్పులపై స్పందన

8 Nov, 2022 10:24 IST|Sakshi

దాదాపు 16 ఏళ్ల కిందట.. ట్విటర్‌ పుట్టుక దశలో ఉన్నప్పుడే మన దేశం నుంచి ఒకావిడ ఆ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను వాడింది. ఆవిడ పేరే నైనా రెద్దు. దేశంలోనే తొలి ట్విటర్‌ యూజర్‌ అనే విషయం మీకు తెలుసా?. అంతేకాదు ఆమె ప్రొఫైల్‌కు బ్లూటిక్‌ కూడా ఉంది. తాజాగా ఎలన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వెళ్లడం.. గుణాత్మకం పేరిట అందులో చోటు చేసుకుంటున్న మార్పులపై నైనా స్పందించారు.

ఆర్కుట్‌, బ్లాగింగ్‌ జమానా టైంలో ట్విటర్‌ ఇంకా అధికారికంగా అడుగుపెట్టని సమయమది. ఆ ఏడాది(2006)లో TWTTR(ట్విటర్‌ ప్రాజెక్టు కోడ్‌ పేరు) పేరిట ఒక మెయిల్‌ నైనాకు వచ్చింది. ఏదో ఇన్విటేషన్‌ అనుకుని అందులో చేరారామె. అలా చేరిన ఆమె.. భారత్‌ తరపున తొలి ట్విటర్‌ యూజర్‌ ఖ్యాతిని దక్కించుకున్నారు. 

నైనా రెద్దు ప్రస్తుతం.. జైసల్మేర్‌(రాజస్థాన్‌)లోని ఓ హోటల్‌లో పని చేస్తున్నారు. అది కాక ఇంకా ఆమెకు కొన్ని హాబీలు పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో 22 వేల పైగా ఫాలోవర్స్‌ మాత్రమే ఉన్నారు. అందులో సెలబ్రిటీలే ఎక్కువ కావడం గమనార్హం. అయినా ఫాలోవర్స్‌ సంఖ్య ప్రామాణికం కాదంటున్నారు ఆమె. ఇప్పటిదాకా ఆమె లక్షా 75వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి ట్విటర్‌లో ఇప్పటిదాకా వచ్చిన మార్పులు, ఎలన్‌ మస్క్‌ పగ్గాల గురించీ ఆమె స్పందించారు. 

TWTTR పేరుతో అందింన ఆహ్వానం నాకింకా గుర్తుంది. అది ట్విటర్‌ మహావృక్షంగా ఎదుగుతుందని ఆనాడు నేను ఊహించనే లేదు. ఆ టైంలో భారత్‌ నుంచి యూజర్లు ఎవరూ లేరు. ట్విటర్‌ ఉద్యోగులు, వాళ్ల స్నేహితులు మాత్రమే ఛాటింగ్‌లో పాల్గొనేవాళ్లు. ముంబైలో ఉద్యోగం కోసం వచ్చాక.. నేనూ అందులో మెసేజ్‌లు చేయాలని అనుకున్నా. కేవలం అదొక మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అనుకుని ఆగిపోయా. అలా ఏడాదిన్నర గడిపోయాక..  ఆ ప్లాట్‌ఫామ్‌ గురించి విషయం అర్థమైంది. ట్వీట్లు చేయడం ప్రారంభించా. 

అమెరికాలో ఓ ఆర్టికల్‌లో తొలి 140 మంది ట్విటర్‌ యూజర్ల మీద ఓ కథనం ప్రచురితమైంది. అందులో నా పేరు చూసుకున్నాకే అర్థమైంది.. ఇదేదో ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్‌ అని. ఆ తర్వాత తక్కువ యూజర్లే ఉన్నప్పటికీ.. తొలి యూజర్‌కావడంతో ట్విటర్‌ నుంచి ఆమెకు బ్లూటిక్‌ మార్క్‌ దక్కింది. 

ఇక తాజాగా ఎలన్‌ మస్క్‌ బ్లూటిక్‌కు డబ్బులు వసూలు చేసే అంశంపైనా నైనా స్పందించారు. నెలకు రూ.650(8 డాలర్లు) దాకా చెల్లించాలని అంటున్నారు. అసలు ఎందుకు చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదు కదా. ఇప్పుడున్న బ్లూటిక్‌ అకౌంట్ల విషయంలోనా? కొత్తగా రాబోతున్న అకౌంట్ల విషయంలోనా? లేదంటే ఇంకా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రతీ ఒక్కరికీ అంటే మాత్రం అది సహేతుకం కాదు. 

ట్విటర్‌ ఒక ప్రైవేట్‌ కంపెనీ. పబ్లిక్‌ ఫిగర్లకు వెరిఫై పేరిట బ్లూటిక్‌లను కేటాయించడం మొదలుపెట్టింది. గత 16 ఏళ్లుగా నేను చెల్లింపులు చేయలేదు. అలాంటిది ఇప్పుడెందుకు చేయాలి? అని మస్క్‌ నిర్ణయంపై నిలదీశారామె. ఇక భారత్‌లో బ్లూటిక్‌ చెల్లింపుల పరిణామం అంతగా ఉండకపోచ్చని ఆమె వ్యాఖ్యానించారు. బ్లూటిక్‌ అనేది సాధారణంగా అవసరం లేని వ్యవహారం. కచ్చితంగా కావాలని అనుకునేవాళ్లు డబ్బు చెల్లిస్తారు. అవసరం లేదనుకునే వాళ్లు మానుకుంటారు. అయితే ఇండిపెండెంట్‌ జర్నలిజం లాంటి పనులు చేసుకునేవాళ్లకు మాత్రం ఇది ప్రభావం చూపించొచ్చు అని నైనా తెలిపారు. 

ఇక ట్విటర్‌ స్వేచ్ఛా ప్రకటనపై ఆమె భిన్నంగా స్పందించారు. ట్విటర్‌కు స్వేచ్ఛకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని అన్నారామె.   మిగతా యాజర్లలాగా తాను ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లను వాడుతున్నానని, ట్విటర్‌లో రాబోయే మార్పులు తనపై ప్రభావం చూపించకపోవచ్చని ఆమె అంటున్నారు. 

మరిన్ని వార్తలు