ట్విటర్‌కు మరో షాక్‌, కేసు నమోదు

16 Jun, 2021 10:48 IST|Sakshi

ట్విటర్‌కు చట్టపరమైన రక్షణ తొలగింపు

మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతోందంటూ తొలి కేసు

యూపీలో ట్విటర్‌, పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్‌ఐఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట‌ర్‌కు కేంద్రం మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. ఫేక్‌ న్యూస్‌, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్‌ మధ్య వివాదం  నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్‌ పట్టించుకోని కార‌ణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొంద‌రు కీల‌క అధికారుల‌ను ట్విట‌ర్ నియ‌మాకాలపై ఇటీవల కేంద్రం తుది హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంలో విఫ‌ల‌మైన కార‌ణంగా  తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో సోష‌ల్ మీడియా మ‌ధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విట‌ర్ కోల్పోయింద‌ని, దీంతో ఇకపై  భార‌త చ‌ట్టాల ప‌రంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ట్విట‌ర్‌పై తొలి కేసు కూడా న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌త‌ప‌ర‌మైన హింస‌ను ప్రోత్సహింఆరంటూ పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. కొత్త ఐటీ నిబంధనలపై చీఫ్ కంప్లైయెన్స్ఆఫీసర్‌తో సహా భారతదేశానికి చెందిన అధికారుల నియామకాల్లో నిబంధనలను పాటించని ఏకైక టెక్ ప్లాట్‌ఫాం ట్విటర్‌ అని కూడా పేర్కొంది. 

జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దేశంలో ముఖ్య అధికారులను నియమించాల్సిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందున ట్విట్టర్ వినియోగదారుల పోస్టులపై విచారణ నుండి భారతదేశంలో చట్టపరమైన రక్షణ కోల్పోయిందని, దీంతో యూపీలో కేసు నమోదైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.మే 25 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలన్నింటినీ ట్విటర్ ఇంకా పాటించలేదని అందుకే మధ్యవర్తిగా వారి రక్షణ లేకుండా పోయిందని వివరించింది. ఏ ప్రచురణకర్త మాదిరిగానే భారతీయ చట్టానికి వ్యతిరేకంగా జరిమానా చర్యలకు ట్విటర్ బాధ్యత వహిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

అయితే నియామకాలపై స్పందించిన ట్విటర్‌ తాత్కాలిక చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించామనీ, ఈ వివ‌రాల‌ను ఐటీ మంత్రిత్వ శాఖ‌తో పంచుకుంటామ‌ని ట్విటర్‌ తెలిపింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా  తాము  అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని వివరణ ఇచ్చింది. 

చదవండి: ట్విటర్‌కు మరోసారి నోటీసులు

మరిన్ని వార్తలు