ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే

9 Jul, 2021 05:51 IST|Sakshi

ట్విట్టర్‌కు స్పష్టంచేసిన నూతన ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో నివసించే, పనిచేసే వారందరూ భారతప్రభుత్వ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రి అశ్విని వైష్ణవ్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్‌ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, నూతన ఐటీ నిబంధనల విషయంలో ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. ట్విట్టర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలోని చట్టాలు అందరికీ సమానమని, అందరూ దీనిని తప్పనిసరిగా పాటించాలని అశ్విని వైష్ణవ్‌ వ్యాఖ్యానించారు.

ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్‌ బుధవారం కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రైల్వేశాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) బీఎల్‌ సంతోష్‌ను కలిసిన తరువాత వైష్ణవ్‌ విలేకరులతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, ఐటి, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖలో బీజేపీ సీనియర్‌ నాయకుడు రవిశంకర్‌ ప్రసాద్‌ స్థానంలో వైష్ణవ్‌ నియమితులయ్యారు. దేశంలో నూతన  నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వం పదేపదే గుర్తుచేసినప్పటికీ ట్విట్టర్‌ ఇంకా సోషల్‌ మీడియా మార్గదర్శకాలకు కట్టుబడలేదు.

ట్విట్టర్‌కు రక్షణ కల్పించలేం: ఢిల్లీ హైకోర్టు
కొత్త ఐటీ నిబంధనల నుంచి అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ యాప్‌ ట్విటర్‌కు ఎలాంటి మినహాయింపు, రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ నిబంధనల ఉల్లంఘన జరిగితే, చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. తాజా ఐటీ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొంటూ అమెరికాలో నోటరీ అయిన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా సమర్పించాలని జస్టిస్‌ రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ట్విటర్‌ను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ నియమించిన అధికారులు కూడా కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని పేర్కొంది.

కోర్టు నుంచి తాము కూడా ఎలాంటి రక్షణ కోరడం లేదని ట్విటర్‌ తరఫు న్యాయవాది సాజన్‌ పూవయ్య తెలిపారు. కొత్తగా నియమించిన చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్, నోడల్‌ ఆఫీసర్‌ తదితర అధికారుల వివరాలను జులై 8లోగా కోర్టు ముందుంచాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ట్విటర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాత్కాలిక ప్రాతిపదికను అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. తాత్కాలిక చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారిని ఇప్పటికే నియమించామని, భారత్‌లో నివసించే గ్రీవెన్స్‌ అధికారిని, నోడల్‌ ఆఫీసర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన ఈ నెల 11న నియమిస్తామని తెలిపారు. వారు తాత్కాలిక అధికారులే అయినా.. పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడ్తారన్నారు. ఫిర్యాదులు, ఇతర వివాదాల విషయంలో పూర్తి స్థాయి బాధ్యత ట్విటర్‌ తీసుకోవాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ కోరారు.  

పారదర్శకత ఉండాల్సిందే
ఫేస్‌బుక్‌కు సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలు పవర్‌ సెంటర్లుగా మారుతున్నాయని, ప్రజల అభిప్రాయాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌కు ఇండియాలో 27 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని గుర్తుచేసింది. ఇలాంటి సామాజిక వేదికలు పారదర్శకత పాటించాల్సిందేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ తమకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఫేస్‌బుక్‌ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్‌ మోహన్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈశాన్య ఢిల్లీలో గత ఏడాది చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి సాక్షిగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ ఢిల్లీ శాసనసభకు చెందిన శాంతి, సామరస్య కమిటీ ఫేస్‌బుక్‌తోపాటు ఇతరులకు గతంలో సమన్లు జారీ చేసింది. సాక్షిగా ప్రశ్నించేందుకు పిలిచే విశేష అధికారాలు ఢిల్లీ హైకోర్టుకు, దాని కమిటీకి ఉన్నాయని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు