జీఎస్టీ ఎఫెక్ట్‌.. ట్విటర్‌ ట్రెండింగ్‌లో పన్నీర్‌ బటర్‌ మసాలా

20 Jul, 2022 19:42 IST|Sakshi

పాలతో ఏ వంటకం చేసిన రుచి అదిరిపోతుంది. అందుకే పాల ఉత్పత్తులతో చేసే ఏ వ్యాపారమైన మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే మార్కెట్లో కూడా వాటికి గిరాకీ బాగానే ఉంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా లాక్‌డౌన్‌, ధరల పెరుగుదల వంటి కారణలతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు తగ్గు ముఖంపట్టాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు మునుపటి పరిస్థితుల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా సవరించిన జీఎస్టీతో ప్రజలకు షాకిచ్చిందనే చెప్పాలి.

ఈ సారి జీఎస్టీ స్లాబ్‌లో పాల ఉత్పత్తులను చేర్చడంతో వ్యాపారులకు షాక్‌, ప్రజలపై మరింత భారం పడనుంది. గత నెలలో జరిగిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు మరికొన్ని వస్తువుల స్లాబ్‌ను పెంచారు. సవరించిన ధరలు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు ఇకపై మునుపటి కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ జీఎస్టీ విధింపులపై ట్విటర్‌ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. పన్నీర్‌ పై 5 శాతం, బటర్‌పై 12 శాతం, మసాలాపై 5 శాతం విధించారు. ఈ క్రమంలో నెటిజన్లు కేంద్రం పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ట్విట్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో  #PaneerButterMasala ( పన్నీర్‌ బటర్‌ మసాలా) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెటిజన్లు కేంద్రాన్ని విమర్శిస్తూనే ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు