కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి

2 Oct, 2023 15:11 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తున్న ఈ కారు ఎడమవైపుకు వెళ్లాల్సి ఉండగా పొరపాటున నేరుగా వెళ్లడంతో కారు పెరియార్ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా మరో ముగ్గురు మాత్రం సురక్షితంగా బయట పడ్డారని పోలీసులు తెలిపారు.

 

ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ముగ్గురు కలిసి హోరువానలో కారులో వెళ్తున్నారు. వీరు కొచ్చిన్ నుంచి కొడంగళ్లుర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా తిరిగి వెళ్తుండగా వర్షం మరింత జోరుగా కురిసింది. మధ్యలో వారు ఎడమవైపు వెళ్లాలని మ్యాప్ సూచించగా వారు పొరపాటున నేరుగా వెళ్లిపోయారు. ఎదురుగా మొత్తం నీరు కనిపిస్తున్నప్పటికీ అక్కడ రోడ్డు నీటిలో మునిగి ఉంటుందని భావించి కారును అలాగే ముందుకు పోనిచ్చారు. కారు నీటిలోకి వెళ్లిన క్షణాల వ్యవధిలోనే అందులోకి జారుకుని పూర్తిగా మునిగిపోయింది. 

కారు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చెరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం ఆ నీటిలో గల్లంతయ్యారన్నారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వారిద్దరు అప్పటికే మృతిచెందడంతో మృతదేహాలను మాత్రం వెలికితీశారు. మృతులు అద్వైత్(29), అజ్మల్(29) ఇద్దరూ కొచ్చిన్ లో ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!

మరిన్ని వార్తలు