విమానంలో మందుబాబుల హల్‌చల్‌.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా..

10 Jan, 2023 05:55 IST|Sakshi

ఇద్దరు తాగుబోతు ప్రయాణికుల అరెస్ట్‌

పట్నా: భారతీయ విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరువకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే, వీరు విమానంలో పట్నాకు వస్తున్నట్లు ఇండిగో సంస్థ ఫిర్యాదుచేయంతో పట్నాలో దిగగానే పట్నా ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారులు అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్యసేవనం రాష్ట్రపరిధిలో నేరం. మద్యం తాగి బిహార్‌లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విమానంలో వీరు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ సీరియస్‌
న్యూఢిల్లీ: పారిస్‌–న్యూఢిల్లీ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌ ఆరున జరిగిన రెండు ఘటనలను అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలను లెక్కచేయకుండా బాత్రూమ్‌లో ధూమపానం చేస్తున్న వ్యక్తిపై, తోటి ప్రయాణికురాలి సీటు, దుప్పటిపై మూత్రవిసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడిపై అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని డీజీసీఏ సూచించింది.

‘ ఏదైనా విమానంలో అనుకోని ఘటన జరిగితే ల్యాండింగ్‌ జరిగిన 12 గంటల్లోపు మాకు నివేదించాలి. కానీ డిసెంబర్‌ ఆరున ఘటన జరిగితే జనవరి ఆరున మేం అడిగేదాకా ఆనాటి ఘటనపై సంస్థ ఎలాంటి రిపోర్ట్‌చేయలేదు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల విషయంలో మీ వైఖరి నిబంధనలకు అనుగుణంగా లేదు. రెండు వారాల్లోపు నివేదించండి. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీజీసీఏ పేర్కొంది. 

మరిన్ని వార్తలు