H3N2 Virus: భారత్‌లో రెండు మరణాలు.. ఎక్కడంటే?

10 Mar, 2023 12:49 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. ఈ వైరస్‌ బారినపడిన వారి సంఖ్యలో దేశంలో రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు.. ఈ వైరస్‌ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఫ్లూ వైరస్‌ పట్ల భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో కూడా మరో​ వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. మరోవైపు.. ఈ వైరస్‌ బారినపడిన వారి సంఖ్య గతకొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వైరస్‌ బారినపడకుండా ఉండాలంటే.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించాలని ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. 

ఇక, ఈ వైరస్‌ సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్‌3ఎన్‌2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఓ వ్యక్తికి సోకింది కోవిడ్‌ లేక ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో  యాంటీబయాటిక్స్‌ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. 

మరిన్ని వార్తలు