కేరళ: విషాదం నింపిన రెండు ప్రమాదాలు

8 Aug, 2020 09:05 IST|Sakshi

తిరువనంతపురం : వరుస దుర్ఘటనలు కేరళీయులను విషాదంలో ముంచెత్తాయి. భారీ వర్షాలతో ఇప్పటికే కుదేలయిన కేరళ విమాన ప్రమాదంతో మరింత తల్లడిల్లింది. శుక్రవారం ఒకే రోజు జరిగిన రెండు దుర్ఘటనలు కేరళలో తీవ్ర విషాదం నింపాయి.  కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని కుదుటపడుతున్న రాష్ట్రం వరుస ప్రమాదాలతో మరోసారి ఉలిక్కి పడింది. 

ఓ వైపు రాష్ట్రంలో కురుస్తున్న జోరు వర్షాలు, మరోవైపు కోళీకోడ్ విమాన ప్రమాదం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌కు సమీపంలో రాజమలై ప్రాంతంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. ఇప్పటికి 15 మంది మృతదేహాలు వెలికితీయగా.. మరో 50 మంది  శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో నిరంతరాయంగా సహాయక చర్యలు కొసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. (విమాన ప్రమాదం; ఆయన ధైర్యమే కాపాడింది!)

ఇదిలా ఉండగా వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్‌కు చేరిన విమానం.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కిందికి దిగుతూనే రన్‌వే పై నుంచి కిందికి జారి రెండు ముక్కలయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోగా.. వీరిలో పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే, కో పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. క్షతగాత్రుల్ని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే రోజు కేరళలో రెండు దుర్ఘటనల్లో దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!)

ఈ ప్రమాద ఘటనలపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్‌ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వీరితోపాటు కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి కేజే ఆల్ఫోన్స్  ‘ఈ రోజు ఇది రెండో విషాదం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ కూడా స్పందించారు. ‘కేరళకు ఈ రోజు విషాదకరమైన రోజు. మొదట మున్నార్‌లో వరదల వల్ల సంభవించిన మరణాలు, ఇప్పుడు విమాన ప్రమాదం. పైలట్లు ఇద్దరూ మరణించడం బాధాకరం. ప్రయాణికులను రక్షించడంలో సహాయక చర్యలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. (విమాన ప్రమాదం: అత్యవసర సమావేశం)

మరిన్ని వార్తలు