టైర్‌ పేలడం యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కాదు..

13 Mar, 2023 04:25 IST|Sakshi

ఇన్సూరెన్స్‌ చెల్లించాల్సిందే: బాంబే హైకోర్టు

ముంబై: కారు టైర్‌ పేలిపోయి ఒక వ్యక్తి మరణానికి దారితీసిన ఘటనలో ఇన్సూరెన్స్‌ కంపెనీ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టైర్‌ పేలిపోవడం యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ తప్ప, డ్రైవర్‌ నిర్లక్ష్యం కాదంటూ చేసిన వాదనని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కారు ప్రమాదంలో మరణించిన మకరంద్‌ పట్వర్థన్‌ కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2010 అక్టోబర్‌ 25న పట్వర్ధన్‌ (38) తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి కారులో పుణె నుంచి ముంబై వెళుతున్నారు.

వారిలో కారుని తెచ్చిన ఒక కొలీగ్‌ చాలా ర్యాష్‌గా డ్రైవ్‌ చేయడంతో కారు ముందు టైర్‌ పేలిపోయి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్థన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదనపరుడు కావడంతో ట్రబ్యునల్‌ అతని కుటుంబానికి న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కారు పేలిపోవడం యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించింది. బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిని విచారించిన కోర్టు టైర్‌ పేలిపోవడం యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కాదని, ఇన్సూరెన్స్‌ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

మరిన్ని వార్తలు